తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక కామెంట్స్
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 7:49 PM ISTతెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక కామెంట్స్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నారు. కర్ర సాయంతో నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నందినగర్‌లో నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేసీఆర్. ఏదో విని.. ఎవరో ఏదేదో చెబితే ట్రాప్‌లో పడొద్దని అన్నారు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా.. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ప్రతినిధులను కలవాలని చెప్పారు. అభివృద్ది కోసం పోరాడాలని.. మంత్రులకు ఆయా పనులపై వినతి పత్రాలను అందిస్తూ ఉండాలని బీఆర్ఎస్ అధినేత ఆ పార్టీ ఎమ్మెల్యలకు సూచించారు.
ఈ సందర్బంగా లోక్‌సభ ఎన్నికలపైనా చర్చించారు కేసీఆర్. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. గెలుపు కార్యాచరణ రూపొందించుకుందామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను అందరితో చర్చించాకే ప్రకటించుకుందామని అన్నారు. ఇక.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత పదేళ్ల పాటు పాలన అందించామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని అన్నారు. ఓటమి నిరుత్సాహంతో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైప కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనలపై కేసీఆర్ ఎంపీలతో చర్చించారు. ఉభయ సభల్లో ఈ అంశంపై నిరసనలు తెలపాలని.. కేంద్ర జల్‌శక్తి మంత్రికి పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదురుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందా? ఉండదా అనేది వారి చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రజలు మనకిచ్చిన ప్రతిపక్ష పాత్రను మాత్రం సమర్ధంగా నిర్వహిద్దామని కేసీఆర్ అన్నారు.