లోక్‌సభ ఎన్నికలకు నలుగురి పేర్లను ప్రకటించిన కేసీఆర్
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla
లోక్‌సభ ఎన్నికలకు నలుగురి పేర్లను ప్రకటించిన కేసీఆర్
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈక్రమంలోనే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. జాతీయ పార్టీలు అయితే రాష్ట్ర ఇంచార్జ్‌లతో టచ్‌లో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలను తెలుసుకుంటున్నాయి. గెలిచే అభ్యర్థులనే బరిలో నిలిపాలని భావిస్తున్నాయి. ఇక తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది.
తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల కోసం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరుని ఖరారు చేశారు. పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మాలోత్ కవిత పోటీ చేయబోతున్నారని కేసీఆర్ ప్రకటించారు.
మార్చి 3, 4వ తేదీల్లో ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. వారికి అన్నీ వివరించి.. అలాగే వారి సలహాలను తీసుకున్న తర్వాతే బీఆర్ఎస్ అధినేత ఈ నలుగురి పేర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. నలుగురి పేర్లనే తొలి జాబితాగా కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపించాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 4, 2024
కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్
పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్
ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లు ప్రకటన
నలుగురు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ pic.twitter.com/yOP23AQhw2