ఎస్‌బీ ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్‌రావు

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 10:00 AM GMT
brs, harish rao,  sangareddy, chemical company accident, telangana,

ఎస్‌బీ ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్‌రావు 

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్‌ పేలడంతో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వరకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన హరీశ్‌రావు.. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్నాయనీ.. ఈ సంఘటనల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని హరీశ్‌రావు అన్నారు. అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అధికారులు ఏడాదికోసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. క్షతగాత్రులు కూడా ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో చెప్పట్లేదని అన్నారు. బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో తెలియడం లేదని ఆవేదన చెందారు. మంత్రులు వచ్చి లాంచనంగా పరామర్శించడం కాదనీ.. చిత్తశుద్ధితో ఆదుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.

అలాగే ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. గాయపడ్డ వారికి రూ.25 లక్షలు, అలాగే మృతుల కుటుంబల్లో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వైద్య ఖర్చులు ప్రభుత్వం, కంపెనీనే భరించాలని అన్నారు. మృతదేహాలను స్వగ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లను చూసుకోవాలని అన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం.. పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని ఖండిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలి తప్ప వేధించకూడదని అన్నారు. తెలంగాణకు చెందిన బాధితులకు బీఆర్ఎస్‌ అండగా ఉంటుందనీ.. తాము సాయం చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


Next Story