బీఆర్ఎస్ పనులను కాంగ్రెస్ ఘనతగా చెప్పడం దౌర్భాగ్యం: హరీశ్‌రావు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 5:15 PM ISTబీఆర్ఎస్ పనులను కాంగ్రెస్ ఘనతగా చెప్పడం దౌర్భాగ్యం: హరీశ్‌రావు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తైన పనులను తమ ఘనతగా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం దౌర్భాగ్యమని అన్నారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ తమ ప్రభుత్వ పనిగా చెప్పుకోవడం వంట అయ్యాక గరిటె తిప్పినట్లుగా ఉందంటూ సెటైర్లు వేశారు. 2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసింది గుర్తు చేశారు. దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకు ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తున్నారంటూ హరీశ్‌రావు విమర్శలు చేశారు. చేయని పనులకు డబ్బా కొట్టుకునే బదులు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై శ్రద్ద పెట్టి వాటిని పూర్తి చేయాలని హరీశ్‌రావు సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగాన్ని బలోపేతం చేశామన్నారు హరీశ్‌రావు. వైద్యారోగ్యరంగాన్ని దేశంలోనే నెంబర్ స్థాయికి తీసుకెళ్లామన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ బీఆర్ఎస్ సర్కారే మంజూరు చేసిందన్నారు. వైద్య సిబ్బందికి కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేశామని హరీశ్‌రావు చెప్పారు. 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం పోస్టులను 7,094కి పెరగ్గా.. 2023 ఆగస్టులో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తోందంటూ విమర్శలు చేశారు హరీశ్‌రావు.
కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోగా 2లక్షల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది.. వాటిని ముందు చూడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఎన్నో ప్రకటనలను చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3, 4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు అన్నారు.