అధికారం ఉన్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదు: హరీశ్‌రావు
దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని అన్నారు హరీశ్‌రావు. అందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 3:29 PM ISTఅధికారం ఉన్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదు: హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందనీ.. వారు బీఆర్ఎస్ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వాళ్లు కొన్ని దుష్ప్రచారాలు చేవారనీ.. వారిని ప్రజలు నమ్మారని అన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కామెంట్స్ చేశారు.
దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని అన్నారు హరీశ్‌రావు. అందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ పొంగిపోలేదని.. అలాగే అధికారం లేనప్పుడు కూడా ఎప్పుడూ కుంగిపోలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని దుష్ప్రచారాలు చేశారు. వాటిని ప్రజలు నమ్మి వారికి అధికారం ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో తాము ఎన్నికల్లో ఓడిపోయామని హరీశ్‌రావు అన్నారు. అయితే.. ఓటమిపై సమీక్ష జరుపుకుందానమి చెప్పారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బతిన్నా.. ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పనిచేశారని.. కష్టపడ్డ కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హరీశ్‌రావు అన్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఇంకా ఉన్నాయనీ.. వాటిల్లో బీఆర్ఎస్ సత్తా చూపుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మరే నాయకులకూ ఉండదని చెప్పారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామని.. పదవులను సైతం గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణను సాధించుకున్నామని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో టాప్‌లో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుదాం.. భవిష్యత్ మనకే ఉంది.. కార్యకర్తలు ఎవరూ నిరాశ, అధైర్యపడొద్దని మాజీమంత్రి హరీశ్‌రావు సూచించారు.