డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేయకుండా, ఉద్దేశపూర్వకంగా అగౌరవపరిచారని తెలంగాణ సీఎంపై బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. రాజ్యాంగ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు, ప్రాథమిక పౌర విధులను నెరవేర్చడంలో విఫలమైనందుకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
ప్రపంచంలోనే డాక్టర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నెలకొల్పారని.. అయితే అహం, ప్రతీకార రాజకీయాల కోసం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం ఘోరమైన నేరానికి పాల్పడ్డాయని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహానికి పూలమాలలు వేయకుండా నిర్లక్ష్యం చేయడం, అగౌరవపరచడం, అలంకరించకపోవడం.. ఉద్దేశపూర్వక చర్య అని అన్నారు. తెలంగాణాలోని ప్రతి పౌరుడిని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి అంబేద్కరిస్టును అవమానించడమేని ఆయన అన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా, దేశంలోని పౌర సంస్థలు, పౌరులు ఆయనకు నివాళులు అర్పించేందుకు అనుమతించడం లేదని.. రాజ్యాంగ నిర్మాతపై, ఆధునిక భారతదేశంపై కాంగ్రెస్‌కు ఎప్పుడూ గౌరవం లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు.