తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలుకి గాయం తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేయలేకపోయారు. అయితే.. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 26న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని పార్టీ నేతలు చెప్పారు. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చించనున్నారు. ఈమేరకు ఎంపీలకు పలు సూచనలు చేస్తారు కేసీఆర్. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు.