బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు నాయకులు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  7 April 2024 12:04 PM GMT
brs, bhadrachalam, mla thellam venkatrao,  congress,

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే  

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాడు. నాలుగు నెలల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. భద్రాచలం నుంచి బీఆర్ఎస్‌ టికెట్‌పై పోటీ చేసిన తెల్లం వెంకట్రావు విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. తెల్లం వెంకట్రావు ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు తెల్లం వెంకట్రావు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరిపోయారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు నాయకులు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దాంతో.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మరోసారి ఇబ్బంది తప్పేలా లేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను బీఆర్ఎస్‌ ఒకేఒక స్థానంలో గెలుపొందింది. అదే భద్రాచలం అసెంబ్లీ స్థానం. అయితే.. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్‌ ను వీడటంతో ఖమ్మం జిల్లాలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. తెల్లం వెంకట్రావు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తెల్లం వెంకట్రావు సన్నిహితుడిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొంగులేటి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆయన బాటలోనే ఆయన సన్నిహితుడు తెల్లం వెంకట్రావు కూడా నడిచారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏప్రిల్‌ 6న జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలోనే రాహుల్‌గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. తర్వాతి రోజే సీఎం రేవంత్‌రెడ్డి సమంక్షలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు తెల్లం వెంకట్రావు.

Next Story