తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఇచ్చిన నోటిసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అధికార ప్రతినిధి బీఎల్ సంతోష్ సిట్ జారీ చేసిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
సిట్ నోటీసులు రద్దు చేయాలంటూ ఇవాళ బీఎస్ సంతోష్ దాఖలు హైకోర్ట్ లో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. 41ఏ సీఆర్ పీసీ నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ వాదనలు వినిపించారు. ఫామ్ హౌస్ కేసులో సంతోష్ అనుమానితుడు కాదని.. నిందితుడు కూడా కాదన్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిట్ దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదని సంతోష్ తరపు లాయర్ అన్నారు. నోటీసుల పేర్లతో బీఎల్ సంతోష్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే సీఎం కేసీఆర్ ఈ కేసులో విచారణలో కలుగజేసుకున్నారని వాదించారు. వాదనల అనంతరం సిట్ నోటీసులు చట్టపరంగా లేవని చెప్పిన హైకోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 5 కు వాయిదా వేసింది.