24 రోజులు.. 328 కిలోమీటర్లు.. నేటి నుంచి బండి యాత్ర
BJP TS President bandi sanjay third phase padayatra started today from yadadri temple. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.
By అంజి Published on 2 Aug 2022 8:55 AM ISTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. 24 రోజుల పాటు జరిగే ఈ యాత్ర.. ఐదు జిల్లాల మీదుగా సాగనుంది. 12 నియోజకవర్గాల్లో 328 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రికి బయల్దేరారు. బండి సంజయ్‌కు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇవాళ రాత్రికి భువనగిరి మండలం బస్వాపూర్ శివార్లలో బండి సంజయ్ బస చేయనున్నారు. మొదటి రోజు మొత్తం 10.5 కి.మీ మేర బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది.
ఇవాళ యాదగిరిపల్లి, గాంధీ విగ్రహం, యాదాద్రి టౌన్, పాత యాదగిరి గుట్ట రోడ్, గొల్ల గుడిశలు, గొల్లగూడెం, దాతర్‌పల్లి మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. యాదాద్రిలో ప్రారంభమై.. వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా సంజయ్ పాదయాత్ర జరగనుంది. ప్రజల సమస్యలు వినడం, ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమేనని సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా సంజయ్ ముందుకు వెళ్లనున్నారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు.
ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు సాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.