అలా అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను: రాజాసింగ్
గోషామహల్ నుంచి పోటీ చేసిన గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 4:44 PM IST
అలా అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను: రాజాసింగ్
తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయనేలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాజాగా గోషామహల్ నుంచి పోటీ చేసిన గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. మూడోసారి ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతుంది. శనివారం ఉదయం జరిగే అసెంబ్లీ భేటీలో రేవంత్‌రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే.. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించబోతున్నారు. ఇదే అంశాన్ని లేవనెత్తారు రాజాసింగ్.
అసెంబ్లీ తీరుపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనని అన్నారు. పూర్తిస్థాయి స్పీకర్ బాధ్యతలు చేపట్టాక ప్రమాణం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కూడా రాజాసింగ్ గెలిచిన తర్వాత ప్రొటెం స్పీకర్ వద్ద ప్రమాణం చేయలేదు. అప్పట్లో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించారు. అప్పుడు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి అవకాశం ఇచ్చారని రాజాసింగ్ ఆరోపించారు. దాంతో.. ముంతాజ్‌ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తిస్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ చాంబర్‌లో రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
మరోవైపు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేఎల్పీ నేతగా రాజాసింగ్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. రాజాసింగ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు ఈ సారి చాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది గెలిచారు. ఆరుగురు కొత్తవారు కాగా.. ఇద్దరే సీనియర్లు ఉన్నారు.