Telangana: బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ అధిష్ఠానం ఆరా
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌తో.. రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
By అంజి Published on 5 April 2023 1:08 PM ISTబండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ అధిష్ఠానం ఆరా
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌తో.. రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ అరెస్ట్, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ ఆరా తీస్తోంది. సంజయ్ అరెస్ట్‌పై ఆ పార్టీ అధిష్ఠానం చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విధానంపై బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు ఆరా తీస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావుకు ఫోన్ చేశారు. అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ కూడా పార్టీ నేతలతో మాట్లాడి.. ఎప్పటికప్పుడూ వివరాలు తెలుసుకుంటున్నారు. సంజయ్ అరెస్ట్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు జేపీ నడ్డా వివరించారని తెలుస్తోంది. ప్రధాని మోదీ కూడా అమిత్‌షాను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారని సమాచారం.
బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ.. తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఎస్‌సీ హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు కరీంనగర్‌లోని తన నివాసం నుండి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.