ఆస్తుల వాటాల కోసమే వైఎస్ఆర్, కేసీఆర్ ఫ్యామిలీలో వివాదాలు: బీజేపీ ఎంపీ
బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్మాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఆస్తుల వాటాల కోసమే వైఎస్ఆర్, కేసీఆర్ ఫ్యామిలీలో వివాదాలు: బీజేపీ ఎంపీ
బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్మాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయా కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని విమర్శించారు.
డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, "ఒకప్పుడు అన్నల కోసం, వదినల కోసం బాణాలుగా మారిన చెల్లెళ్లు, ఇప్పుడు అధికారం, ఆస్తుల కోసం అన్నల మీదే బాణాలు గురిపెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ అవసరాలు, వారసత్వమే ముఖ్యమన్నట్లుగా ఈ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నాయి. నిన్న వైఎస్ఆర్ కుటుంబం, నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతున్నాయి" అని వ్యాఖ్యానించారు.
ఈ కుటుంబ కలహాల వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. "అన్నల మీదకు చెల్లెళ్లను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే, వైఎస్ షర్మిలను ఆయనపైకి ఉసిగొల్పి, ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అదేవిధంగా, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటోందన్న వాదన బలపడుతోంది" అని లక్ష్మణ్ విశ్లేషించారు. తండ్రులు సంపాదించిన అక్రమాస్తులు, అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే ఈ కుటుంబ వివాదాలకు ప్రధాన కారణమని ఆయన పునరుద్ఘాటించారు.