భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్ తగిలింది. ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల క్రితం తలపెట్టిన బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్ యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారనే అభియోగాలపై రాజాసింగ్‌పై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
దీనిలో భాగంగా విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు కావడంతో ఆయన వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు పై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్ పేర్కొన్నారు.ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఎంపీ బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డిలపై వేర్వేరుగా నమోదైన పలు కేసుల్లో నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరిపింది.
కరీంనగర్‌లో బండి సంజయ్‌పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. మంత్రి మల్లారెడ్డిపై నమోదైన కేసులను కొట్టివేయడానికి కోర్టు సమ్మతించలేదు.