టీఆర్ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌

BJP leaders Swamy Goud, Dasoju Shravan join TRS in presence of Minister KTR. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ సమయంలో పలువురు నాయకులు పార్టీలు మారుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  21 Oct 2022 11:41 AM GMT
టీఆర్ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ సమయంలో పలువురు నాయకులు పార్టీలు మారుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్‌ రాజీనామా చేయగా. తాజాగా దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు రాజీనామా లేఖలను పంపించారు. దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్‌ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి చేరారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు శ్రవణ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని.. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా పనిచేసి, ఆ తర్వాత తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్ గా వ్యవహరించిన స్వామి గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే ఆయన ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. 2020 వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగిన స్వామి గౌడ్.. త‌ర్వాత‌ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాదాపుగా రెండున్నరేళ్లకు పైగానే బీజేపీలోనే ఉన్న స్వామి గౌడ్ ఎక్కడా కనిపించిన దాఖలా లేదు. తాజాగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు.
Next Story
Share it