ఆ అనుమానాలే నిజమయ్యాయి.. మేడిగడ్డ వంతెన కుంగడంపై కిష‌న్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీ వంతెన కుంగడంతో ప్రతిపక్షాలు BRS స‌ర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి

By Medi Samrat  Published on  23 Oct 2023 3:31 AM GMT
ఆ అనుమానాలే నిజమయ్యాయి.. మేడిగడ్డ వంతెన కుంగడంపై కిష‌న్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీ వంతెన కుంగడంతో ప్రతిపక్షాలు BRS స‌ర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ విష‌య‌మై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ.. వేలకోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయని.. నేడు ఆ అనుమానాలే నిజమై.. వాస్తవాలు తేటతెల్లమయ్యాయన్నారు. సూపర్ ఇంజినీర్లు, డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారని.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్‌గా మారి ప్రాజెక్టు నిర్మించారని ఎద్దేవా చేశారు. నిపుణులు, ఇంజినీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం సమస్యలమయంగా మారిందని దుయ్యబట్టారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పగా చెప్పుకున్నారని.. కానీ వాస్తవంలో బొక్కబోర్లా పడ్డారని.. కాళేశ్వరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించిందని విమ‌ర్శించారు.

‘కాళేశ్వరం’తో ఏటా 400 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామని అప్పట్లో కేసీఆర్ ఘనంగా ప్రకటించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం 100 టీఎంసీలే ఎత్తిపోశారన్నారు. బ్యారేజీ వంతెన కుంగడం చిన్న విషయం కాదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టు ఇదని.. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యారేజీ పరిశీలించేందుకు వెళుతున్న వారిని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story