టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ లెక్క పెడుతున్నామని, తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తామన్న బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీలో చేరేవారిని కేసులో భయపెడుతున్నారని ఈటల ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ప్రజా ప్రతినిధులపై రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరించడం సరికాదన్నారు. బీజేపీ చేరే నాయకులపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని, ఇది దారుణమన్నారు.
ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. ఎన్ని రకాలుగా భయపెట్టినా బీజేపీలో చేరే నాయకులను ఆపలేరన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవని.. చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. కేసులు పెట్టి భయపెడితే ఊరుకునేది లేదన్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా టీఆర్‌ఎస్ వదలట్లేదన్నారు.
కార్యకర్తలను వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగదీసుకోవాలనుకుంటున్నారని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల మీద మునుగోడు నియోజకవర్గంలో సీఎం సభ ఏర్పాటు చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని మునుగోడు ప్రజలు నిర్ణయించుకున్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.