మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి.. అధికారిక ప్రకటన
BJP has confirmed Rajagopal Reddy as MLA candidate earlier. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు
By అంజి Published on 8 Oct 2022 1:31 PM IST
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 8న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. శాసనసభలో తన పదవికి కూడా రాజీనామా చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది.
''మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకులు నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు. మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తాను.'' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
అక్టోబర్ 14 నామినేషన్లకు చివరి తేదీ. మరుసటి రోజు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17 చివరి తేదీ. ఈ క్రమంలోను మునుగోడులో బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది. మునుగోడులో కాషాయ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్య నేతలంతా ప్రచారానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విమర్శలు సంధిస్తున్న రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఏ ఛాన్స్ వదలడం లేదు. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను ప్రచారానికి దింపేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ నటి జీవిత రాజశేఖర్ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని, ఆమె రెండు మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. జీవిత పార్టీలో చురుగ్గా ఉంటూ అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడానికి వెనుకడుగు వేయదు. కిషన్ రెడ్డి కూడా జీవితా రాజశేఖర్‌కు మద్దతుగా నిలిచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన @BJP4India నాయకత్వం శ్రీ @narendramodi శ్రీ @AmitShah శ్రీ @JPNadda & శ్రీ @blsanthosh గారికి ధన్యవాదాలు. తప్పకుండా మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తాను. pic.twitter.com/MIo4c1frCs
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 8, 2022