కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓటను లెక్కించగా.. టీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్‌కు 503 ఓట్లు, బీజేపీకి 159 ఓట్లు, కాంగ్రెస్ 35 ఓట్లు వచ్చాయి. మరో 14 ఓట్లు చెల్లకుండా పోయాయి.
అనంతరం ఈవీఎం లెక్కింపు ప్రారంభమైంది. రెండు రౌండ్లు ముగిసాయి. రెండో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కంటే 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సరికి.. బీజేపీకి 9,461, టీఆర్‌ఎస్‌కు 9,103, కాంగ్రెస్ 339 ఓట్లు వచ్చాయి.
తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో బీజేపీ 4,851, టీఆర్‌ఎస్ 4,659 ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు కేవలం 220 ఓట్లు సాధించింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. రొట్టెల పీట గుర్తు కొంత వరకు కారు గుర్తును పోలి ఉండటం ఓటర్లను తికమకకు గురి చేసిందని అంటున్నారు. తొలి రౌండ్ లో రొట్టెల పీట గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కంటే రొట్టెల పీట గుర్తుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.