మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 6:26 AM GMTమజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాము ప్రమాణస్వీకారం చేయబోమమని ఉందే చెప్పారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశంలో ప్రమాణస్వీకారానికి ఇవాళ దూరంగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.
ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎన్నుకుందని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారనీ.. వారిని కాదని ఏ ప్రతిపాదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారని కిషన్‌రెడ్డి అన్నారు. 2018లో ఒక ఎమ్మెల్యే ఉండగా.. ఇప్పుడు 8 మందికి పెరిగామని చెప్పారు. అలాగే తమ ఓటు బ్యాంకు కూడా 6 శాతం నుంచి 14 శాతానికి పెరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసన సభ గౌరవాన్ని కాలరాసిందని ఆరోపించారు. మజ్లిస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ చేసిందని అన్నారు. అయితే.. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యే ఉన్నా కూడా.. అక్బరుద్దీన్‌ను ఎందుకు ప్రొటెం స్పీకర్ చేశారని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని గవర్నర్ వద్దకు కూడా తీసుకెళ్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణస్వీకరం చేయబోరని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రెగ్యలర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకరాం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.