గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది

By Knakam Karthik
Published on : 11 Jun 2025 12:03 PM IST

Gali Janardhan Reddy, Telangana High Court, Obulapuram Mining Company, CBI

గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్‌

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే... ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కార్యకలాపాల ఆరోపణలపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మే 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటక శాసనసభ గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, లేకపోతే తన నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే తాను మూడున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపానని, ఒకవేళ తన స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తీవ్రంగా నష్టపోతానని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

గాలి జనార్దన్ రెడ్డి తరఫు వాదనలు విన్న హైకోర్టు, ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లరాదని, తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని షరతులు విధించింది. తదుపరి విచారణ ప్రక్రియకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది.

Next Story