మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుకు గురికావడంతో తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2024 6:45 AM IST
bhupalpally court, notice,  Telangana,  kcr,

మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు 

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుకు గురికావడంతో తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇదే హాట్‌ టాపిక్‌గా ఆరింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు కుంగుబాటుపై విచారణకు కమిటీ వేసింది. అలాగే కోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.

మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ జీ జీఎం సురేశ్ కుమార్‌ కూడా విచారణకు హాజరుకావాలని పేర్కొంది. మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కేసీఆర్ సర్కారే కారణమని ఆరోపణలు వచ్చాయి. ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారంటూ దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ పోలీసులను ఆదేశించాలని కోరుతూ 2023 నవంబర్ 7న భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. తమ పరిధిలోకి రాదని కొట్టివేసింది. దాంతో దాన్ని సవాల్‌ చేస్తూ రాజలింగమూర్తి ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టుకు వెళ్లాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం. సెప్టెంబర్‌ ఐదో తేదీన విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులకు జారీ చేసింది.

Next Story