రాహుల్ ర్యాలీలో స్కూటీ పైనుంచి కిందపడ్డ కొండా సురేఖ, గాయాలు
రాహుల్‌గాంధీ పాల్గొన్న ర్యాలీలో స్కూటీ పైనుంచి కిందపడి ఆ పార్టీ నేత కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 9:45 AM GMTరాహుల్ ర్యాలీలో స్కూటీ పైనుంచి కిందపడ్డ కొండా సురేఖ, గాయాలు
తెలంగాణలో ప్రచార జోరు పెరిగింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ఆయా ప్రధాన పార్టీ నాయకులు ప్రచారం వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొంటున్నారు. రెండోరోజు భూపాలపల్లి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. కాగా.. రాహుల్ గాంధీ ర్యాలీ జరుగుతుండగా అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖకు ప్రమాదం తప్పింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్యనేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. దాంతో.. ర్యాలీ జోరుగా సాగింది. వాహనాలు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. అయితే..ఇదే బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. స్వయంగా స్కూటీ నడిపారు. అయితే.. జనాలు ఎక్కువగా ఉండటంతో ఆమె స్కూటీ నడుపుతూ తడబడ్డారు. దాంతో.. అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కొండా సురేఖకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కొండా సురేఖను ఆమె భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
అయితే.. స్కూటీ పైనుంచి కిందపడ్డ క్రమంలో కొండా సురేఖ తలకు, చేతికి స్వల్ప గాయాలు అయ్యాయి. చిన్న చిన్న గాయాలే అని ప్రమాదం పెద్దగా సంభవించలేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కొండా సురేఖ ఆ గాయాలకు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిపాయి.