భూమా అఖిల‌ప్రియ‌కు షాక్.. బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

Bhuma Akhilpriya bail petition refused by secunderabad court.భూమా అఖిల‌ప్రియ‌కు షాక్.. బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 8:06 AM GMT
Bhuma Akilapriya kidnap case

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు కోర్టులో చుక్కెదురైంది. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన బోయిన్ ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌ను సికింద్రాబాద్ కోర్టు తిర‌స్క‌రించింది. అంతేకాదు..ఆమెను క‌స్ట‌డీకి ఇవ్వాల‌న్న పోలీసుల పిటిష‌న్ కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. దీంతో అఖిల ప్రియను మూడు రోజులు పోలీసులు‌‌ క‌స్ట‌డీకి తీసుకోనున్నారు. అఖిల‌ప్రియ మెడిక‌ల్ రిపోర్టును చంచ‌ల్‌గూడ జైలు అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించారు. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు బెయిల్ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది.

ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని కోర్టుకు పోలీసులు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్నారు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని.. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో లోతుగా విచారించేందుకు అఖిల‌ప్రియ‌ను క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌న్న పోలీసుల విజ్ఞ‌ప్తిని కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే.. ఏడు రోజులు క‌స్ట‌డికి ఇవ్వాల‌ని అడ‌గ్గా.. మూడు రోజులు మాత్ర‌మే క‌స్ట‌డికీ అనుమ‌తి ఇస్తూ కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. నేటి నుంచి 13 వ‌ర‌కూ అఖిల ప్రియ‌ను క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించ‌నున్నారు పోలీసులు.

Next Story
Share it