ఆర్ఎస్ఎస్ వ్యక్తులను రక్షణ రంగంలోకి పంపటం కోసమే అగ్నిపత్‌ పథకాన్ని తీసుకొచ్చారు

Bhatti Vikramarka Fire On Center. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్

By Medi Samrat  Published on  27 Jun 2022 9:02 AM GMT
ఆర్ఎస్ఎస్ వ్యక్తులను రక్షణ రంగంలోకి పంపటం కోసమే అగ్నిపత్‌ పథకాన్ని తీసుకొచ్చారు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మధిర నియోజక వర్గ కేంద్రంలోని ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపత్‌ పథకం దేశ ప్రజల రక్షణ కోసం తక్షణమే విరమించుకోవాలన్నారు.

ఆర్ఎస్ఎస్ వ్యక్తులను భారత రక్షణ రంగంలోకి పంపటం కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్‌ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే నిరుద్యోగులను ఆందోళన వైపు పురిగొల్పుతున్నాయన్నారు. రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇవ్వటం ద్వారా దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో యువత హింస మార్గం వైపు మల్లుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వరంగ సంస్థలు అమ్మటం అంటే భారతదేశాన్ని అమ్మటమేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. యువతకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థల అధిపతులు అయిన అంబానీ, ఆదానీలకు దారాదత్తం చేస్తూ ఉన్న ఉద్యోగాలను కొల్ల గొడుతున్నారని విమ‌ర్శించారు.

నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని ఆదానీ, అంబానీ లకు అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుతంగా సత్యాగ్రహం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన అభినందించారు.
















Next Story