బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లు.. నెలకు బ్యాంక్ వడ్డీగా రూ. 7 కోట్ల సంపాదన

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వద్ద రూ.1,250 కోట్ల పార్టీ ఫండ్‌ ఉందని, రూ.767 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లు నెలకు రూ.ఏడు కోట్ల వడ్డీని

By అంజి  Published on  28 April 2023 2:15 PM IST
Bharat Rashtra Samithi, KCR, BRS party fund

బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లు.. నెలకు బ్యాంక్ వడ్డీగా రూ. 7 కోట్ల సంపాదన

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వద్ద రూ.1,250 కోట్ల పార్టీ ఫండ్‌ ఉందని, రూ.767 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లు నెలకు రూ.ఏడు కోట్ల వడ్డీని ఇస్తున్నాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం జరిగిన బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ నిర్వహణకు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రచారానికి అయ్యే ఖర్చులను వడ్డీ ఆదాయంతోనే పెడుతున్నామన్నారు. ''పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లకు చేరిందని, అందులో రూ.767 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. పార్టీ నిర్వహణకు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రచారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చులను దీని ద్వారానే భరిస్తున్నాం'' అని తెలిపారు.

అక్టోబర్ 21, 2021 ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ (అప్పటి టీఆర్‌ఎస్) రూ. 425 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, అవి నెలకు రెండు కోట్ల రూపాయల వడ్డీని ఇస్తాయని చెప్పారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలపై బీఆర్‌ఎస్‌ సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానం ప్రకారం.. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు ఖాతాలు తెరవడం, పార్టీ ప్రచారానికి మీడియా సమన్వయం కోసం వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో సహా పార్టీ ఆర్థిక వ్యవహారాలను పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారు. ఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మే 4న ప్రారంభించనున్నట్లు పార్టీ తెలిపింది.

ఇదిలా ఉండగా, పార్టీని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో టీవీ ప్రకటనలు, సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని, అవసరమైతే టీవీ ఛానెల్‌ని కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి అంశంలో పారదర్శకత పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడవద్దని కేసీఆర్ తన ప్రజా ప్రతినిధులకు సూచించారు.

Next Story