భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలోని పోతులవారి వీధిలో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్ప కూలిన విషయం తెలిసిందే. తాజాగా భవనం శిథిలాల మరో మృతదేహం లభ్యమైంది. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన మేస్త్రీ పడిశాల ఉపేందర్ మృతదేహాన్ని గురువారం రాత్రి సమయంలో రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వెంటనే డెడ్‌బాడీని బయటకు తీశారు. అయితే గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మాసన్ చల్లా కామేష్ శిథిలాల నుండి బయటకు తీశారు. కానీ ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు. తాజాగా మరో మేస్త్రీ ఉపేందర్ మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది.
రెస్క్యూ టీంలో సింగరేణి, అగ్నిమాపక సేవలు, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బంది ఉన్నారు. ఈ భవనం గతంలో నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మిస్తున్నప్పటికీ ఆరు అంతస్తుల నిర్మాణానికి అవసరమైన అనుమతి లేకుండానే నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం పక్కన ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కూలిపోయిందని స్థానికులు తెలిపారు. భద్రాచలం ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. భవనం కూలిపోయిన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపారు. సహాయక బృందాలు కుక్కలను కూడా రప్పించాయన్నారు.