పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరైన యాంకర్
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో టాలీవుడ్ యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik
ఆ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరైన యాంకర్
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో టాలీవుడ్ యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు శ్యామలను విచారిస్తున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాంతో న్యాయస్థానం శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను సూచించింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్యామల సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ఇక ఇదే బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, విష్ణుప్రియ, రీతూచౌదరి ఈనెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. తాజాగా.. యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరితోపాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. వీరికోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు బెట్టింగ్ యాప్స్ విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభాశెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి ఉన్నారు. తొలుత బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తరుత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.