గుడ్‌న్యూస్.. ఆ పథకం దరఖాస్తుకు రేషన్ కార్డు చాలు, బీసీ కార్పొరేషన్ క్లారిటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంపై బీసీ కార్పొరేషన్ ఓ కీలక విషయాన్ని ప్రకటించింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్.. ఆ పథకం దరఖాస్తుకు రేషన్ కార్డు చాలు, బీసీ కార్పొరేషన్ క్లారిటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంపై బీసీ కార్పొరేషన్ ఓ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ పథకానికి అప్లయ్ చేసుకోవడానికి రేషన్ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు వెల్లడించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ సెంటర్లలో అప్లికేషన్లు భారీగా అందుతున్న నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది.
అయితే 2016 తర్వాత మీ సేవ సెంటర్ల నుంచి తీసుకున్న కాస్ట్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందని, మళ్లీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తులను నింపి ప్రజా పాలన కేంద్రాల్లో సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు వెల్లడించారు.
కాగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా విభజించింది. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణాన్ని అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్లను మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీని కల్పిస్తుంది. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60 శాతం రాయితీ కల్పిస్తారు.