ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి, బీసీ సంఘాల నాయకులతో సీఎం రేవంత్

బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

By Knakam Karthik
Published on : 18 March 2025 3:54 PM IST

Telangana Assembly, BC Communities, BC Reservation Bill, Cm Revanthreddy

ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి, బీసీ సంఘాల నాయకులతో సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడారు. ‘ఈ అభినందనలు నాకు కాదు.. రాహుల్ గాంధీకి అందాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులసర్వే నిర్వహించాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

‘అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, ఆ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది’ అని మరోసారి గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులుగా పనిచేసిన వారిలోనూ ఎక్కువ మంది బీసీలే ఉన్నారని అన్నారు. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని చెప్పారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌‌లో పడకండి అని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది బీసీలే అని చెప్పారు.

Next Story