బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత

ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ చేస్తూ, దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూశారు.

By అంజి  Published on  24 Aug 2023 2:53 AM GMT
బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత

Bathini Harinath, Hyderabad, Bathini Family 

ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ చేస్తూ, దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్‌ గౌడ్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 84 ఏళ్లు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం. బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో హరినాథ్‌ కన్ను మూశారు. బత్తినీ హరినాథ్ గౌడ్‌కు భార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీలోని దూద్ బౌలి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా బుధవారం హరినాథ్ గౌడ్ మృతి చెందగా విశ్వనాథ్ ఒక్కరే ఉన్నారు.

1983 సంవత్సరంలో పాత బస్తీ దూద్ బౌలి నుంచి భోలక్ పూర్ పద్మశాలి కాలనీ వచ్చి, అక్కడే నివాసం ఉంటున్నారు. బత్తిని సోదరులు గత 176 సంవత్సరాలుగా ఉబ్బసం, దమ్ము వ్యాధులు నయం అయ్యేందుకు చేప మందు ప్రసాదంను ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున నగరంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీ చేస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. బత్తిని హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చేప మందు పంపిణీకి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందిస్తుంది. ఇలా చేప మందు ప్రసాదం ఉచితంగా ఇచ్చే బత్తిని హరినాథ్ గౌడ్ లేరనే విషయం తెలిసి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story