వేలంలో రూ.కోటికిపైగా పలికిన గణేష్ లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..
గణేశ్ నిమజ్జనం రోజు లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో లంబోదరుడి లడ్డూ రికార్డు ధర పలికింది.
By అంజి Published on 28 Sept 2023 10:44 AM IST
Bandlaguda Jagir, Ganapati Laddu, Laddu auction, Hyderabad
హైదరాబాద్: వినాయక పండగ ఉత్సవాల్లో వివిధ భంగిమల రూపంలో ఉన్న విగ్నేశ్వరుడి విగ్రహాలను నిలపడమే కాకుండా ఆయన చేతిలో ఉన్న లడ్డును కూడా ప్రత్యేకంగా తయారు చేయించి పెడుతూ ఉంటారు. నవరాత్రులు విగ్నేశ్వరుడితో పాటు ఆ లడ్డు కూడా పూజలు అందుకుంటుంది. అటువంటి లడ్డూలకు ఎంతో ప్రత్యేకత ఉంది. గణేష్ నిమజ్జనం సమయంలో చాలా చోట్ల లడ్డు వేలం పాట పాడే విషయం అందరికీ తెలిసిందే. బాలాపూర్ లడ్డు వేలం రికార్డును బండ్లగూడ జాగీర్ కీర్తి రీచ్ విల్లా గణపతియ్య లడ్డు వేలం పాట బ్రేక్ చేసింది. హైదరాబాదులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో ఎవ్వరు ఊహించని రీతిలో గణేష్ లడ్డూకు రికార్డ్ వేలం పలికింది. ఆ విల్లాలో గణనాథుడి చేతిలో ఉన్న లడ్డుకు వేలు కాదు , లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల పైచిలుకు ధర పలికింది. వేలం పాటలో వినాయకుడి లడ్డును రూ.1.26 కోట్లకు దక్కించుకున్నారు. రికార్డు స్థాయిలో లడ్డు ధర పలక డంతో స్థానికులు సైతం ఒక్కసారిగా అవాక్క య్యారు.
కోటి రూపాయల పైచిలుకు పెట్టి లడ్డును ఎవరు దక్కించుకున్నారా అని ఆలోచిస్తున్నారా.. విల్లాలో ఉండే నారీమణులందరు కలిసి లడ్డును కోటి రూపాయల పైచిలుకు పలికి దక్కించుకున్నారు. అలా వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత ఏడాది 2022 వేలంపాటలో లడ్డు 60.80 లక్షల పలికింది. నేడు కోటి రూపాయల పైచిలుకు పలికింది. ఇదిలా ఉండగా మరోవైపు మాదాపూర్ లోని మై హోమ్ భుజా లో కూడా లక్షల్లో లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో ఎదుల కంటి చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి 25 లక్షల 50 వేల రూపాయలకు వేలం పాట పాడి లడ్డును సొంతం చేసుకున్నారు. గత ఏడాది లడ్డు వేలం పాట 18 లక్షల 50 వేల రూపాయలకు పోగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 25 లక్షల 50 వేల రూపాయలు పలికింది.