వస్తున్నా..వచ్చేస్తున్నా.. బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ
బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా భట్టిని కలిశారు.
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 9:01 AMవస్తున్నా..వచ్చేస్తున్నా.. బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ
బండ్ల గణేష్ అంటేనే ఒక వైరల్. ఆయన మాట్లాడేతీరు.. వ్యవహారం ఎప్పుడూ హాట్‌టాపిక్ అనే చెప్పాలి. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా బండ్ల గణేష్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆడియోఫంక్షన్లు.. ప్రీరిలీజ్ ఈవెంట్లలో హీరోల అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తారు. సినిమా రంగంలో మొదట కమెడియన్‌గా కనిపించారు. ఆ తర్వాత నిర్మాతగా అవతారమెత్తి భారీ చిత్రాలను నిర్మించాడు. ఆ తర్వాత ఉన్నట్లుండి ప్రొడక్షన్ ఆపేశాడు. అయితే.. 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లో చురుగ్గా కనిపంచారు. కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ.. చివరకు బండ్లకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. అప్పటి నుంచి బండ్ల గణేష్ పొలిటికల్‌గా పెద్దగా ఎప్పుడూ మాట్లాడలేదు.
తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ వైరల్‌గా మారింది. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చేయేస్తా అని ట్వీట్ చేశారు. ట్వీట్ చేశాక ఆయన భట్టి విక్రమార్కను కూడా కలిశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కొద్దిరోజులు పాదయాత్ర చేసి ఆపేస్తారనుకున్నా.. కానీ భట్టి విక్రమార్క పట్టుదలతో ఉన్నారు. ఈసారి కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బండ్ల గణేష్ దీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో తెలంగాణకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కాగా.. భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పీపుల్స్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉన్న బండ్ల గణేష్.. భట్టి విక్రమార్కను కలవడంపై చర్చ జరుగుతోంది. మరోసారి కాంగ్రెస్ కోసం చురుగ్గా పనిచేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానాన్ని టికెట్ కోరుతారా.? లేదంటే ప్రచారానికే పరిమితం అవుతారా అన్ని వేచి చూడాలి.