'కాళేశ్వరం పరిశీలిస్తాం.. అనుమతివ్వండి'.. ప్రభుత్వానికి బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay's letter to the government seeking permission to visit Kaleswaram. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీనే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని

By అంజి  Published on  28 Aug 2022 7:34 AM GMT
కాళేశ్వరం పరిశీలిస్తాం.. అనుమతివ్వండి.. ప్రభుత్వానికి బండి సంజయ్‌ లేఖ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీనే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు చేస్తున్నారు. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించాల‌నుకుంటున్నామ‌ని, అందుకు అనుమ‌తి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సంజ‌య్ ఓ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, వరదల్లో మోటర్ల మునకపై తాము సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించే వారిలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్‌ మొత్తం 30 మంది ఉంటారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో బీజేపీ బృందం సందర్శిస్తుందని బండి సంజయ్‌ చెప్పారు. ఇందుకు పర్మిషన్‌ ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి బీజేపీ బృందం వెళ్తుందని లేఖలో తెలిపారు. 2004 - 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని సంజయ్‌ వివరించారు. అలాగే ప్రభుత్వం కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపించి తమ సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీని కోసం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ.94 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే గడిచిన మూడేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అవసరం పడలేదు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ప్రాజెక్టులన్ని నిండిపోయాయి. దీంతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు వృథాగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత నెలలో వచ్చిన గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లు నీటమునిగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సందర్శనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? ఇవ్వదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Next Story