ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌.. సీఎంకు బండి సంజయ్‌ లేఖ

Bandi sanjay wrote a letter to cm kcr on salaries. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్‌దారులకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్ చేస్తూ

By అంజి  Published on  24 July 2022 1:39 PM IST
ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌.. సీఎంకు బండి సంజయ్‌ లేఖ

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్‌దారులకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం అసమర్థత పాలనకు నిలువుటద్దం అన్నారు. 2014లో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతి నెల 15వ తేదీ వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని మండిపడ్డారు.

''ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం, రిటైర్‌ అయినవారికి పెన్షన్ అందించడం ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వానిదైనా తప్పనిసరి విధి. ఉద్యోగులు, పెన్షన్‌దారులు సకాలంలో వేతనాలు పొందే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కును మీ ప్రభుత్వం కాలరాస్తోంది.'' అని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 300 (ఎ) ప్రకారం.. సకాలంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు వేతనం పొందే ప్రాథమిక హక్కును కల్పించింది.

ప్రభుత్వం సకాలంలో ఉద్యోగుల, పెన్షన్‌దారులకు సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని సంజయ్ అన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులు, టీచర్లు, పెన్షన్‌దారులు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల చెల్లింపుల విషయంలో ఉదాసీనత విడనాడి వారికి ఖచ్చితంగా 1వ తేదీన జీతాలు అందేటట్లు చూడాలని బండి సంజయ్‌ కోరారు.

Next Story