నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్‌లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈ నేపథ్యంలో అక్కడ అన్యాయానికి గురైన గిరిజనులకు అండగా తాము ఉన్నామని భరోసా ఇవ్వడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం గుర్రంబోడు తండాలో గిరిజన భరోసా యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుందని.. వారికి అన్యాయం చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కార్యకర్తలతో కలిసి మళ్లీ సూర్యాపేటకు వెళ్తానని.. దమ్ముంటే ఆపండని తెలంగాణ పోలీసులకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కాషాయ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెరాస నేతలు గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుర్రంబోడు తండాలో హైకోర్టు ఉత్తర్వులు పనిచేయడంలేదని అన్నారు.
కాలయాపన కోసమే సీఎం కేసీఆర్ కమిటీలు వేస్తారని బండి సంజయ్ మండిపడ్డారు. అబద్ధాల సీఎంను ప్రజలెవరూ విశ్వసించరని పేర్కొన్నారు.ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి వాళ్ల ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు. సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయమన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, అధ్యాపకులను మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారా అని మండిపడ్డారు.