'ప్రీతిది లవ్ జిహాదీ కేసు'.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
లవ్ జిహాద్ కారణంగానే వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం జరిగిందని బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 24 Feb 2023 3:31 PM ISTబండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
లవ్ జిహాద్ కారణంగానే వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం జరిగిందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి దేవాలయం దగ్గర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. ''ఇది 'లవ్-జిహాద్' కేసు. హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు విదేశాల పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తున్నాయి. లవ్-జిహాద్ పేరుతో మహిళలను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెడుతున్నారు' అని ఆయన అన్నారు.
ర్యాగింగ్ కారణంగానే వరంగల్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బాలికకు మెరుగైన వైద్యం పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఇది విద్యార్థి సంఘాల ఆందోళనలను చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన అన్నారు. పోలీసులు ఈ కేసును చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. దీనిని చిన్న కేసుగా మార్చడానికి కుట్ర జరుగుతోందన్నారు. విద్యార్థిని కుటుంబానికి బదులు వేధింపులకు పాల్పడిన వారిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసి) అనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండి) మొదటి సంవత్సరం చదువుతున్న ధరవతి ప్రీతి బుధవారం సీనియర్ వేధింపుల కారణంగా తన ప్రాణాలను హరించే ప్రయత్నం చేసింది. వరంగల్ పోలీసులు సీనియర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడైన మహ్మద్ సైఫ్‌పై శుక్రవారం వరంగల్ జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్ తెలిపారు. అంతకుముందు నిమ్స్‌ను సందర్శించిన వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని రక్షించేందుకు వైద్యులు తమవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. కేఎంసీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని అధికారి స్పష్టం చేశారు. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాత్రి నిమ్స్‌ను సందర్శించి విద్యార్థిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమిళిసై ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ వైద్య విద్యార్థికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. సీనియర్ల వేధింపుల కారణంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతీస్ ఆత్మహత్య కేసులో పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ఇప్పటికే స్పష్టం చేశారు.