మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే ఛాన్స్‌: బండి సంజయ్

Bandi Sanjay said that there is a chance of election anytime in next 6 months. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌.. కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లీస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

By అంజి  Published on  7 Jan 2023 4:01 PM IST
మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే ఛాన్స్‌: బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌.. కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లీస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలు.. రాజకీయాల గురించి కాకుండా, అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. మాటల్లో తప్ప చేతల్లో చూపించడం లేదన్నారు. రాష్ట్రానికే న్యాయం చేయని కేసీఆర్‌.. దేశాన్ని ఉద్ధరిస్తారట అంటూ సెటైర్‌ వేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌.. పోలింగ్‌ బూత్‌ల వల్లే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్థమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు.

పోలింగ్‌ బూత్‌ కమిటీల వల్లే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీకి మూల స్తంభం పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీలేనన్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని సరళ్‌ యాప్‌ను ప్రారంభించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.

Next Story