'కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు'

Bandi sanjay praja sangrama yatra yadadri minister kishan reddy comments. సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on  2 Aug 2022 2:52 PM IST
కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డపై కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు. ఏడాది తర్వాత తప్పకుండా మార్పు వస్తుందని, అధికారులు ఇది తెలుసుకోవాలని, చట్ట ప్రకారం పని చేయాలని వారికి సూచించారు. ఉన్న సింహాసనం ఊడిపోయే పరిస్థితి వచ్చిందని, ఢిల్లీలో సింహాసనం ఎక్కేది తర్వాత ఆలోచించాలన్నారు. అన్యాయంగా వ్యవహరిస్తే ప్రజలు ఏనాటికీ క్షమించరన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. యాదాద్రిలో బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

అధికార దుర్వినియోగ సర్కార్‌ ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ సర్కారేనని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ఈ ప్రభుత్వం అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపమని దుయ్యబట్టారు. ధర్మాన్ని, న్యాయాన్ని పక్కన పెట్టి తన రాజ్యం అంటూ పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ఎందరో సీఎంలు ఉన్నారని, వారందరూ ప్రజలను కలుస్తారని, తెలంగాణ సీఎం మాత్రం ప్రజలను కలవరని కామెంట్ చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సచివాలయం ఉందా? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఇక్కడ రైతులు నష్టపోతుంటే.. పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి డబ్బులు ఇస్తారని విమర్శించారు. రైతుల దగ్గరి నుంచి ధాన్యం కొంటున్నామని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. రూ. 1300 ఎంఎస్ పీ ఉంటే.. ఏడు సంవత్సరాల్లో రూ. 2,060 చేశామన్నారు. దీంతో రైతులకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలిచ్చి.. ఆ తర్వాత మర్చిపోతారని ఎద్దేవా చేశారు.

Next Story