రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గు చేటు: బండి సంజయ్

Bandi Sanjay lashed out at BRS MPs for boycotting the President's speech. బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించడాన్ని తెలంగాణ

By అంజి  Published on  31 Jan 2023 10:53 AM GMT
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గు చేటు: బండి సంజయ్

బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. దళిత, ఆదివాసీ మహిళలను అగౌరవపరిచే విధంగా పార్లమెంట్‌లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బహిష్కరించిందని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటన్నారు.

''ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి కావడాన్ని బీఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేకపోయింది. ప్రసంగంలో సమస్యలు ఉంటే, మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ వాటిని లేవనెత్తవచ్చు కానీ బహిష్కరించాల్సిన అవసరం లేదు. వారు వెంటనే క్షమాపణలు చెప్పాలి'' అని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌ను, దేశంలో రాష్ట్రపతి పట్ల సీఎం కేసీఆర్‌ కావాలనే ఈ ధోరణితో వ్యహారిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ మహిళలంటే గౌరవం లేదని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు కాంగ్రెస్ నాయకులు వాతావరణం బాగోలేకపోవడం వల్ల శ్రీనగర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పదవికి ఎన్నికైన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ విజన్‌ను ఆమె వివరించారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము మంగళవారం పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో, వరుసగా రెండు పర్యాయాలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాత్మక ప్రభుత్వంగా గుర్తించబడిందని అన్నారు.

''ప్రపంచంలో ఎక్కడ రాజకీయ అస్థిరత ఉందో, ఆ దేశాలు భారీ సంక్షోభంతో ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉంది'' అని ముర్ము అన్నారు. ప్రభుత్వాన్ని సుస్థిరమైనది, నిర్భయమైనది, నిర్ణయాత్మకమైనదిగా పేర్కొంటూ.. "మన ప్రభుత్వం పెద్ద కలలను సాకారం చేసే దిశగా పని చేస్తోంది" అని ముర్ము అన్నారు. ''సమాజంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా మన ప్రభుత్వం పని చేసింది. గత కొన్నేళ్లుగా మన ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా అనేక ప్రాథమిక సౌకర్యాలు 100 శాతం జనాభాకు చేరుకున్నాయి, ఆ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి'' అని రాష్ట్రపతి అన్నారు.

Next Story