కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) రెడీ అయినందున నిర్మాణ పనులకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను.. బండి సంజయ్ కలిసి లేఖను అందజేశారు. కరీంనగర్ - హసన్ పర్తి మధ్య 61.8 కి.మీల మేర నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని బండి సంజయ్.. అశ్వినీ వైష్ణవ్‌కు తెలిపారు.
రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. తక్షణమే ఆమోదం తెలపాలని బండి సంజయ్ కోరారు. ఈ న్యూ రైల్వే లేన్ నిర్మాణం పూర్తైతే తన కరీంనగర్ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. అలాగే కరీంనగర్ - వరంగల్ మధ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థిక వృద్దికి తోడ్పడుతుంది. ఉప్పల్ స్టేషన్ అప్‌గ్రేడేషన్, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌పై వేగవంతమైన చర్యల అవసరాన్ని కూడా బండి సంజయ్.. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉప్పల్ రైల్వే ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల సౌకర్యాలు, పార్కింగ్ విస్తరణ, సోలార్ ప్యానెళ్లు, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమాలు వేగంగా పురోగతిని చూస్తాయని, కరీంనగర్‌లో గణనీయమైన మెరుగుదలలు జరిగేలా చూస్తాయన్న నమ్మకంతో ఉన్నట్టు బండి సంజయ్ వివరించారు.