కాంగ్రెస్, బీజేపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలని.. ఎవరు పడితే వాళ్లు.. ఇష్టమొచ్చినట్లుగా టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ అనగానే ఆ పార్టీల వారిలో వణుకు మొదలైందన్నారు. కుల గజ్జి రేవంత్, మత పిచ్చి బండి సంజయ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బండి సంజయ్‌కు చేతనైతే విభజన హామీలు అమలు చేసి చూపించాలని బాల్క సుమన్ అన్నారు.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామన్నారు. సోనియాకు ఈడీ నోటీస్ ఇస్తే కాంగ్రెస్ ధీటుగా పోరాడటం లేదని, ఆ పార్టీ కొన ఊపిరితో ఐసీయూలో ఉందన్నారు. కాంగ్రెస్‌ది అంతిమ యాత్ర అయితే టీఆర్ఎస్‌ది జైత్రయాత్ర అని అన్నారు బాల్క సుమన్. బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన అని, గల్లీలో తుగ్లక్ వాదన అని బాల్క సుమన్ సెటైర్లు వేశారు. బీజేపీ ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామని అన్నారు. మరో పోరాటానికి దేశం సిద్ధ పడుతుందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.