Telangana: జూన్ 3 నుంచి బడి బాట కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రత్యేక నమోదు కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటను పాఠశాల విద్యాశాఖ
By అంజి Published on 31 May 2023 7:30 AM ISTTelangana: జూన్ 3 నుంచి బడి బాట కార్యక్రమం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రత్యేక నమోదు కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటను పాఠశాల విద్యాశాఖ జూన్ 3 నుంచి జూన్ 17 మధ్య చేపట్టనుంది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అన్ని ఆవాసాలలోని పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంపొందించడంతోపాటు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం, గ్రామ విద్యా రిజిస్టర్‌ను నవీకరించడం, ఉన్న పిల్లలను చేర్పించడం బడి బాట కార్యక్రమం యొక్క ఇతర లక్ష్యాలలో కొన్ని.
5వ తరగతి పూర్తి చేసిన పిల్లలను అప్పర్ ప్రైమరీ స్కూల్/హైస్కూల్‌లో చేర్పించడం, 7వ, 8వ తరగతి పూర్తి చేసిన పిల్లలను హైస్కూల్‌లో చేర్చుకోనున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా జూన్ 3 నుంచి జూన్ 9 మధ్య ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్, జూన్ 12న మన ఊరు మన బడి /మన బస్తీ మన బడి కార్యక్రమం, జూన్ 13న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసీ (తొలిమెట్టు), జూన్ 14న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. అలాగే జూన్ 15న పిల్లల ప్రత్యేక అవసరాలు, బడి బయట పిల్లల నమోదు, జూన్ 16న పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై అవగాహన, జూన్ 17న బాలికా విద్య, కెరీర్ గైడెన్స్ అనే అంశంపై కార్యక్రమాలు చేపట్టనున్నారు.