మంథనిలో బహుబలి సీన్ రిపీట్‌.. పసికందును రక్షించిన పెద్దనాన్న

Baahubali scene repeats in floods.. Father who saved 2 month old baby. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.

By అంజి  Published on  14 July 2022 4:51 PM IST
మంథనిలో బహుబలి సీన్ రిపీట్‌.. పసికందును రక్షించిన పెద్దనాన్న

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని మర్రివాడను భారీ వరద ముంచెత్తింది. బొక్కలవాగుకు భారీ వరద రావడంతో పలు గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయి. సూరయపల్లి, పోతారం , సిరిపురం, బెస్తపల్లి, విలోచవరం గ్రామాల్లోని ప్రజలను నాగారం రైతువేదిక, బెస్తపల్లి గవర్నమెంట్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పునరావస ప్రాంతాలకు తరలించారు. మర్రివాడ మొత్తం నీట మునిగింది. దీంతో ఓ ఇంట్లోని కుటుంబసభ్యులు దగ్గర్లోని ఇంటి పైఅంతస్థుకు వెళ్లారు. అయితే ఆ ఇంట్లో రెండు నెలల బాబుతో సుమలత అనే బాలింత చిక్కుకుపోయింది. తల్లీబిడ్డను ఎలాగైన కాపాడాలని బంధువులు నిశ్చయించుకున్నారు.

అయితే బాలింత భుజాల వరకు వస్తున్న వరదల్లో నడిచేందుకు ఆమె శరీరం సహకరించక ఇబ్బందిగా మారింది. వెంటనే ఆ ఇంటికి చేరుకున్న తన అక్క కొడుకు రంజిత్‌ సుమలతను గట్టిగా పట్టుకుని వరద ముంపు నుంచి ఒడ్డుకు చేరుకున్నాడు. అదే సమయంలో పసిబిడ్డను భుజాన వేసుకుని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. పసిబాబు పెద్దనాన్న రామ్మూర్తి వినూత్నంగా ఆలోచించాడు. ఒక పెద్ద తట్టలో పసిబాబును పడుకోబెట్టి, చలి తగలకుండా వెచ్చగా ఉండేలా చుట్టూ బట్టలు పెట్టాడు. బాహుబలి సినిమాను తలపించేలా.. ఆ బాబు ఉన్న తట్టను రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని.. జాగ్రత్తగా నడుస్తూ సురక్షిత ప్రదేశానికి తీసుకువచ్చారు. బాలింతను చంటిబాబును తీసుకు వస్తున్న దృశ్యాన్ని వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ దృశ్యాలను బాహుబలి సినిమాతో పోల్చుతూ నెటిజన్లు వైరల్​ చేస్తున్నారు.

Next Story