రేవంత్ కేబినెట్‌లోకి అజారుద్దీన్..మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం
రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు అవకాశం కల్పించింది.
By - Knakam Karthik |
రేవంత్ కేబినెట్‌లోకి అజారుద్దీన్..మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం
తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు అవకాశం కల్పించింది. 22 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇటీవలే మరో ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, దళిత సామాజికవర్గానికి చెందిన వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రులుగా అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య 15కు చేరింది. మిగిలిన మూడు మంత్రి పదవుల్లో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మంత్రిగా రేపు ఉదయం 11 గంటలకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఆగస్టులో సుప్రీంకోర్టు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల నామినేషన్లను కొట్టివేసిన తరువాత, అజారుద్దీన్ గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ అయ్యారు. సవరించిన జాబితాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోదండరామ్ అజా,రుద్దీన్‌లను నామినేట్ చేశారు. ఆయన చేరికతో, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కి పెరుగుతుంది. ముఖ్యమంత్రితో సహా తెలంగాణలో మంత్రి మండలి మొత్తం బలం 18గా ఉంది.