ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్టు.. కీలక విషయాలు వెలుగులోకి..

Auto Driver Rape Attempt On Pharmacy Student at Ghatkesar. ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By Medi Samrat  Published on  11 Feb 2021 5:40 PM IST
Auto Driver Rape Attempt On Pharmacy Student at Ghatkesar

హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫార్మసీ విద్యార్థినిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు సైతం ప్రముఖ మీడియాకు అందాయి. నాగారంలోని రాంపల్లి చౌరస్తాలో సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో ఫార్మసీ విద్యార్థినితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ప్రయాణించారు. అయితే మిగిలిన ప్రయాణికులను దింపేసిన ఆటో డ్రైవర్‌.. ఫార్మసీ విద్యార్థినిని మాత్రం దింపకుండా తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి యువతిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. ఈ క్రమంలో యువతిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నరన్న సమాచారం తెలుసుకుని యువతిని వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాళ్లను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పురోగతి సాధించిన రాచకొండ పోలీసులు

కాగా, ఫార్మసీ యువతిపై అత్యాచారయత్నం కేసులో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. యువతిని తీసుకెళ్లిన ఆటో, ఆటో డ్రైవర్‌ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న బీఫార్మసీ విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్‌, కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిపించి బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లినట్లు పోలీసులు వివరించారు.

ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 6.30 గంటల సమయంలో నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్‌స్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్‌, మరో ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కొంత దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే అనుమానం వచ్చిన విద్యార్థిని తన తల్లికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కుమార్తె ఫోన్‌తో అప్రమత్తమైన తల్లి.. బంధువుల సాయంతో డయల్‌ 100కు ఫోన్‌ చేఏసి సమాచారం అందించారు. వెంటనే పోలీసు బృందాలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు.

ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతున్నారు. అయితే బాధితురాలిపై అత్యాచారం జరిగిందా..? లేదా అన్న దానిపై విచారణ చేపడుతున్నారు.


Next Story