విషాదం: తల్లిదండ్రులపై దాడి.. భయంతో బాలిక మృతి
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:52 AM ISTవిషాదం: తల్లిదండ్రులపై దాడి.. భయంతో బాలిక మృతి
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రెండుకుటుంబాల మధ్య గొడవలు ఒక బాలిక మృతికి కారణం అయ్యాయి. బాలిక కళ్లెదుటే తన తల్లిదండ్రులపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాంతో..తీవ్రంగా భయపడిపోయిన బాలిక హఠాన్మరణం చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె పావని (14) ఉన్నారు. సోమయ్యకు, అదే గ్రామానికి చెందిన కడారి సైదులుకి కొన్నేళ్లుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టిన సద్దుమణగలేదు. ఇక చివరకు సోమయ్య వ్యవసాయం వదిలేసి సూర్యాపేటకు వెళ్లి మెకానిక్‌గా స్థిరపడ్డాడు. సైదులు వ్యవసాయం చేస్తున్నాడు. ఆరు నెలల కిందట తన కుమార్తె పావని అనారోగ్యానికి గురయ్యింది. మరోసారిసోమయ్య కుటుంబంతో కలిసి మళ్లీ స్వగ్రామమైన డి.కొత్తపల్లి వచ్చి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న సైదులు.. గురువారం రాత్రి కడారి సోమయ్య, కాసం కళింగం అనే ఇద్దరితో కలిసి కాసం సోమయ్య ఇంటికి వెళ్లాడు. కర్రలు, రాడ్లతో సోమయ్య దంపతులపై దాడి చేశారు.
ఈ సంఘటనలో భార్యభర్తలు ఇద్దరు గాయపడ్డారు. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసిన పావని భయాందోళనకు లోనైంది. దాంతో.. అక్కడే ఉన్నట్లుండి కుప్పకూలింది. ప్రాణాలు కోల్పోయింది. ఉన్నట్లుండి కన్నబిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.