తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడులను చూస్తుంటే.. రాజకీయ హింస పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా సూర్యపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్లు గ్రామంలో జరిగిన ఘటన షాకిస్తోంది. గ్రామంలో బీఎస్పీ, మరో పార్టీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్యపై హత్యాయత్నం జరిగింది. జానయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరో పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆయనపై గొడ్డలితో దాడికి యత్నించాడు.
ఈ క్రమంలో అడ్డువచ్చిన జానయ్య అనుచరులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోరమైన దాడి ఘటన నుంచి జానయ్య తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బీఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని బీఎస్పీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.