మరో న్యాయవాది పై దాడి.. ఉలిక్కిపడిన బార్ అసోసియేషన్..!
Attack On Another Advocate In Warangal. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి చేశారు.
By Medi Samrat
పట్టపగలు నడిరోడ్డుపైనే దారుణహత్య జరిగింది. న్యాయవాదులైన దంపతులను కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, నాగమణి దంపతులు హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. ఈ కేసులు సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం... బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావు, చిరంజీవిలను అరెస్ట్ చేసిన పోలీసులు వసంతరావును ఏ1గా, కుంట శ్రీనివాస్ ను ఏ2గా, కుమార్ ను ఏ3గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. న్యాయవాద దంపతుల హత్య జరిగిన మరుసటి రోజే.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి చేశారు. హంటర్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వేణు స్వల్పంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. న్యాయవాది ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం వద్ద ఏర్పడిన వాగ్వాదం వల్ల ఈ దాడి జరిగిందని సమాచారం. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం కృషి చేసే వారిపై జరిగే దాడులను ఖండిస్తున్నారు. విచక్షణా రహితంగా దాడులు, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.