ఇవాళ్టి నుంచే ఆషాఢమాస బోనాల సంబురాలు షురూ

ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభంకానున్నాయి.

By Knakam Karthik
Published on : 26 Jun 2025 7:05 AM IST

Telangana Bonalu, Hyderabad, Bonalu Festival, Cm Revanth

ఇవాళ్టి నుంచే ఆషాఢమాస బోనాల సంబురాలు షురూ

ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాలు ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగనున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో బోనాలు సంబురాలు మొదలవుతాయి.

బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం జూలై 6వ తేదీ ఆదివారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, బోనం ఎత్తుతారు. మూడో వారం జూలై 13వ తేదీ ఆదివారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు. నాలుగో వారం జూలై 20వ తేదీ ఆదివారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు.

ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా తొమ్మిది రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. బోనాలు సందర్భంగా జూన్‌ 26వ తేదీ గురువారం మొదటి బోనం, జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3 వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24 వ తేదీ గురువారం తొమ్మిదో బోనం నిర్వహించనున్నారు. ఈ రోజుతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.

సీఎం రేవంత్ శుభాకాంక్షలు:

ఆషాఢ మాస బోనాలు జరగనున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలవుతుందని సీఎం అన్నారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుందన్నారు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Next Story